కూతురు అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్

  • కేసీఆర్ కుటుంబం సొంత వివాదాలతో సతమతమవుతోందన్న టీపీసీసీ చీఫ్
  • కేసీఆర్ కుటుంబం పదవుల కోసం పాకులాడుతోందని విమర్శ
  • ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించడం లేదన్న మహేశ్ కుమార్ గౌడ్
పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, నేడు తన కూతురు కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం సొంత వివాదాలతో సతమతమవుతోందని, వారు ప్రజల సమస్యలపై కాకుండా కేవలం పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు బీఆర్ఎస్‌ను ఆదరించారని, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించడం లేదని అన్నారు. బీఆర్ఎస్‌కు ఇక భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఈ క్రెడిట్ అంతా సోనియా గాంధీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణ కోసం సోనియా గాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే, కేసీఆర్ తన పాలనతో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి నెట్టారని అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగ విలువల రక్షణకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Mahesh Kumar goud lashes out at KCR
TPCC chief Mahesh Kumar Goud

More Telugu News